ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
బురుజు.కాం Buruju.com: Hyderabad: భూమి రికార్డులకు సంబంధించి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అధికారంలోకి వస్తే ధరణిని ప్రక్షాళన చేసి దానికి ‘భూ మాత’ అనే పేరు పెడతామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. దాని పేరును ‘మీ భూమి’గా మారుస్తామని బీజేపీ వెల్లడించింది. నిజానికి భూమికి నేల, మన్ను అనేవి మాత్రమే అచ్చమైన తెలుగు పదాలు. మిగతావన్నీ సంస్కృతం నుంచి వచ్చినవే. ఇలా వాడుకలోను, కావ్యాల్లోను 40కి పైగా పేర్లు ఉన్నట్టు ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధా కృష్ణ తన ‘మాటల మూటలు.. పదబంధాల వివరణ’ గ్రంథంలో వెల్లడించారు.
ధరణి పోర్టల్
ధరణిని Dharani portal ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్, బీజేపీలు అంటుండగా భూమి హక్కులకు భరోసాగా ఉన్న ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతి బహిరంగ సభలోను ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ వారు పెడతామన్న ‘భూ మాత’ పేరు 30 ఏళ్ల క్రితం నాటిదని, అది మనకు ఎందుకు అని ఆయన సిద్ధిపేట జిల్లా చేర్యాల సభలో ప్రశ్నించారు. పరోక్షంగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పేరు ఇప్పుడు తెలంగాణలో ఎందుకంటూ కొంత సెంటిమెంటును జోడించే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ ప్రకటించిన ‘మీ భూమి’ పేరు ‘మీ సేవ’ అన్ లైన్ పోర్టల్ కు దగ్గరగా ఉంది.
భూమికి గల స్థిర, ధర, ధరణి, ధారుణి, ధరిత్రి అనే మాటలకు కదలకుండా ఉండేది అనే ప్రధాన అర్ధం ఉన్నట్టు బూదరాజు రాధాకృష్ణ వెల్లడించారు. అంటే జీవరాసులను ధరించేది, మోసేది అనే భావం అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కొంత కసరత్తు చేసి ఉన్నట్లైతే అవి ప్రకటించిన భూ మాత, మీ భూమి కంటే మంచి పదాలు వెల్లడయ్యి ఉండేవి. భూమికి పర్యాయ పదాలు ఇలా ఉన్నాయి.. ఇల, అచల, అనంత, రస, స్థిర, ధర, ధరణి, ధారణి, ధామిణి, ధరిత్రి, క్షోణి, జ్వా, క్ణితి, ఉర్వి, గోత్ర, కు, పృథివి, పృథ్వి , క్ష్మా, క్షమ, అవని, మేరిని, మహి, విపుల, పుడమి, ధాత్రి, జగతి, విశ్వంభర, రత్నగర్భ, వసుంధర, సర్వంసహ, వసుమతి, వసుధ, భూత ధాత్రి, అబ్ధిమేకల తదితరాలు. రాయప్రోలు వారు తమ కావ్యాల్లో తల్లి భూమి అని వాడారు. ఇటీవల కాలంలో కొందరు తెలంగాణ కవులు నేలతల్లి, నేలమ్మ అనే పదాలతో మంచి పాటలు రాశారు. భూమిని మనం తల్లిగా (మదర్ ల్యాండ్)గా వ్యవహరిస్తే జర్మన్లు తండ్రిగా (ఫాదర్ ల్యాండ్) గా భావించటం విశేషం.