బురుజు.కాం Buruju.com: తెలుగు నేలపై కొన్నేళ్ల క్రితం వరకు పిచ్చయ్య పేరు చాల మందికి ఉండేది. పిచ్చయ్య అంటే పిచ్చివాడు అని కొందరు రచయితలు , సినిమాలు ప్రచారం చేయటంతో తెలుగు వారు క్రమేణా ఆ పేరును పెట్టుకోవటం మానివేశారు. అమాయకుడిని సంబోధించేటప్పుడు ఆ పేరును ప్రస్తుతం వాడుతున్నారు. పిచ్చయ్యపై Buruju.com కొంత పరిశీలన జరినప్పుడు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పిచ్చయ్య పరమ శివుడికి మరో పేరు.
దీపాల పిచ్చయ్య శాస్త్రి ప్రఖ్యాత సాహితీ వేత్త. ఎన్నో గ్రంధాలను రాశారు. ఇంకా పురాణం పిచ్చయ్య, చదలవాడ పిచ్చయ్య వంటి ఎంతో మంది రచయితలు ఉండేవారు. పాదరక్షల రంగంలో మంచి పేరు సంపాదించుకొన్నవారు చుక్కపల్లి పిచ్చయ్య. అప్పట్లో కొందరు సాహితీ వేత్తలకు కూడా పిచ్చయ్య అంటే ఎవరో తెలియదని చెప్పటానికి 1923లో వెలువడిన ‘ ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక ’ ఒక నిదర్శనం. దానిలో ఏమి రాశారంటే.. ఒకప్పుడు పిచ్చయ్య పేరుగల వారు విఖ్యాతులై ఉండటం వల్లనే దానిని తెలుగు వారు పెట్టుకొంటున్నారని వివరించారు. కవి, రచయిత ద్వానా శాస్త్రి కూడా పిచ్చయ్యను అంచనా వేయలేకపోయారు. బిడ్డలు పుట్టి మరణిస్తున్నా, రోగాలు వచ్చినా, కీడును సంకించినా తమ పిల్లలకు పిచ్చయ్య, వెర్రియ్య వంటి పేర్లను పెట్టుకొనేవారంటూ తన ‘ తెలుగు తెలుసుకొందాం’ అనే గ్రంధంలో పేర్కొన్నారు.
అనేక గ్రంధాలను రచించిన దీపాల పిచ్చయ్య శాస్త్రి
నిజానికి పిచ్చయ్య అంటే శివుడు. శివుడికి బిక్షపతి అనే పేరు ఉంది. బిక్ష అనే సంస్కృత పదం తమిళ ధ్వనితో ‘పిచ్చె’ గా మారిపోయి శివుడి పేరు తమిళనాట ‘పిచ్చాండార్’ అయ్యింది. ఇదే పేరును తెలుగులో పిచ్చయ్యగా వ్యవహరించినట్టు మండిగంటి సుజాతా రెడ్డి తన ‘ చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర’ అనే గ్రంధంలో విశదీకరించారు. తమిళనేలపై శివాలయాల్లో బ్రహ్మోత్సవాల చివరి రోజున భిక్షాటన పరుడైన సన్యాసిగా పిచ్చాండి విగ్రహాన్ని ఊరేగిస్తారని ‘తెలుగు వారి వింత పేర్లు’ అనే గ్రంధంలో వేదము వెంకట రామ శాస్త్రి తెలిపారు. చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో కాశీలో ఘోరంగా మోసపోయే పాత్రకు ( ఏవీఎస్ నటించారు) పెద పిచ్చయ్య అని, అతని కొడిక్కి చిన పిచ్చయ్య అనే పేర్లు పెట్టటంతో అమాయకులకే అటువంటి పేరు ఉంటుందనే భావన మరింత బలపడిపోయింది.