బురుజు.కాం Buruju.com : Hyderabad: ఒక సినిమా హిట్టైతే ఆదే తరహా చిత్రాలు వరస పెట్టి వచ్చేస్తుంటాయి. చివరికి ఇవి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. నేర పరిశోధన పేరుతో వెలువడుతున్న సినిమాలు ఇప్పుడు అటువంటి బాట పడుతున్నాయి. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ‘లెవెన్’, ‘బ్లైండ్ స్పాట్’ అనే రెండు క్రైమ్ చిత్రాలు ఒకే మూసలో ఉండి ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలంటే నొసలు చిట్లించేలా చేశాయి. రెంటిలోను నవీన్ చంద్ర పోలీసు ఆఫీసరుగా నటించి రెంటిలోను ఒకే తరహా ముగింపును ఇచ్చారు. నిర్మాతలు ఇక ఇటువంటి కథలకు స్వస్తి పలకటం ఎంతైనా అవసరం.
విభిన్నమైన నేర కథాంశాలతో కూడిన మళయాల సినిమాలు విజయాలను చవిచూస్తుండటంతో ఇప్పుడు అవే తరహా చిత్రాలు తెలుగుతో సహా వివిధ భాషల్లో పెద్ద సంఖ్యలో తయారవుతున్నాయి. ఇతర భాషల్లోనివి కూడా తెలుగు డబ్బింగుతో ఓటీటీ వేదికలపై ప్రత్యక్షమవుతున్నాయి. ఇలా జూన్ నెలలో అమెజాన్ ప్రైమ్ లో వెలువడిన Eleven , Blind Spot అనే రెండు చిత్రాల్లోను నేరాలను దర్యాప్తు చేసే పోలీసు అధికారే చివరికి ఆయా నేరాలను చేసిన వ్యక్తిగా నిరూపితమవుతాడు. రెండు సినిమాల్లో వేర్వేరు నటులు నటించి ఉంటే రెంటినీ చూసిన వారికి కొంతవరకైనా ఊరట లభించి ఉండేది. రెంటిలోను పోలీసు అధికారిగా నటించిన Naveen Chandra ఒకే తరహా నటనతో , ఒకే తరహా ముగింపుతో విసుగు తెప్పించారు.
కవల పిల్లలు మాత్రమే చదివే పాఠశాలలో చిన్నప్పుడు తన సోదరుడిని కొందరు క్లాస్ మేట్స్ గెలిచేసి అతను చావుకు కారకులయ్యారనే కోపంతో పోలీసు అధికారి అయ్యాక ఆయా కవలల్లో ఒక్కొక్కరిని అత్యంత దారుణంగా హతమారుస్తుండటం సినిమాలోని కథ. తానే హత్యలు చేస్తూ తానే దర్యాప్తు చేయటం సినిమాలోని ట్విస్టు. బాల్యంలోని కొందరి చిలిపి చేష్టలను ఇలా పెద్దాయ్యాక కూడా పగగా పెంచుకొని వారిని చంపటం అనేది ప్రేక్షకలకు నచ్చలేదు కనుకనే థియేటర్లలో దానికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక బ్లైండ్ స్పాట్ సినిమా విషయానికి వస్తే దీనిలోను పోలీసు అధికారైన హీరో తాను ప్రేమించిన యువతిని చాలా తెలివిగా హతమార్చి ఆ కేసును తానే దర్యాప్తు చేస్తుంటాడు. ఈ సినిమా కూడా థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఓటీటీ కారణంగా ఇప్పుడు ప్రేక్షకులకు తలనొప్పితప్పటం లేదు.