బురుజు.కాం Buruju.com : Hyderabad: హీరో కృష్ణ నటించిన దేవదాసు సినిమాలోని ‘ఇది నిశీధ సమయం’ పాట నాగేశ్వరరావు నటించిన దేవదాసులోని ’జగమే మాయ’ పాటకంటే అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ అది ప్రజాదరణ పొందలేక పోయింది. అందుకు అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన కారకులుగా పరిగణించొచ్చు. సరిగ్గా కొత్త దేవదాసు విడుదల తేదీకి వారం రోజుల ముందు నాగేశ్వరరావు తన దేవదాసును మళ్లీ విడుదల చేయించి కృష్ణకు తీవ్ర ఆవేదనను మిగిల్చారు. కృష్ణ నటించిన దేవదాసు Devadasu ఘోర పరాజయం పాలయ్యింది. ఇది విడుదలయ్యి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా Buruju.com అందిస్తున్న కథనం ఇది.
బెంగాలి రచయిత శరత్ బాబు రాసిన దేవదాసు Devadas నవల ఆధారంగా అనేక భాషల్లో సినిమాలు వచ్చాయి. తెలుగులో నాగేశ్వరరావు నటించిన సినిమా 1953లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకొంది. ఆ తర్వాత 20 ఏళ్లకు.. 1974లో కష్ణ నటించిన దేవదాసు వెలువడింది. పాతదాని కంటే కలర్ లో చిత్రీకరించిన కొత్తదే అన్ని విధాల బాగుంటుంది. ప్రియురాలు ఒక వృద్దుడిని పెళ్లి చేసుకోవాల్సిరావటంతో ప్రియుడు మద్యానికి బానిసయ్యి మరణానికి చేరువయ్యే సమయంలో ఒక పాట పాడతాడు . అదే.. నాగేశ్వరరావు సినిమాలోని జగమే మాయ, కృష్ణ సినిమాలోని ఇది నిశీధ సమయం పాటలు. జగమే మాయ పాటను సీనియర్ సముద్రాల రాశారా? లేక మల్లాది రామ కృష్ణ శాస్త్రి రాశారా? అనేది ఇక ఎప్పటికీ వీడని చిక్కుముడిగానే ఉండిపోయింది. ఇది నిశీధ సమయం పాటను ఆరుద్ర రాశారు. రమేష్ నాయుడి సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దీనిని పాడారు.
ఇది నిశీధ సమయం పాటలోని పల్లవి, చరణాలు
ఇది నిశీధ సమయం పాటను దాదాపు పదేళ్ల క్రితం ఈటీవీ స్వరాభిషేకం వేదికపై ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం పాడుతుంటే వీక్షకుల కళ్లు చెమ్మగిల్లాయి. పాట పాడిన తర్వాత ఆయన దీని గురించి చెబుతూ.. జగమే మాయ పాటకు ఏమాత్రం తీసుపోని పాట ఇదని, సినిమా కనుక బాగా అడుంటే తనకు ఎన్నో అవార్డులు వచ్చుండేవని వ్యాఖ్యానించారు. ‘‘ పాటను అరుద్ర గొప్పగా రాశారు. నేను చాలా కష్టపడి పాడాను. సినిమాలో కూడా పాటను బాగా చిత్రీకరించారు’’ అని వివరించారు. సినిమాలోని ఇంకా..‘‘ పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’’, ‘‘ మేగాల మీద సాగాలి’’, ‘‘ కలచెదిరింది.. కథ మారింది’’, ‘‘ ఈ రోజు.. చాలా మంచి రోజు’’ పాటలు కూడా మంచి సాహిత్య గుభాళింపులతో హ్రుదయాలను హత్తుకొనేలా ఉంటాయి.
తన దేవదాసు పరాజయానికి నాగేశ్వరరావు కారకులని హీరో కృష్ణ Hero Krishna కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ నా దేవదాసు విడుదలకు ముందు నాగేశ్వరరావు.. అమెరికాకు వెళ్తూ కలిశారు. నేను నటించిన దేవదాసు గురించి చెప్పాను. నా జేబులో నుంచి సిగరెట్ తిసి వెలిగిస్తూ ఇదే ఆఖరి సిగరెట్. ఆపరేషన్ చేయించుకొనేందుకు వెళ్తున్నా.. నా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి’’ అని అన్నారు. సరిగ్గా నా సినిమా విడుదలకు వారం ముందు
ఆయన పోటీగా తన దేవదాసును సెకండ్ రిలీజ్ చేశారు. నా దేవదాసు ప్లాప్ కావటానికి అది కూడా ఒక కారణమే’’ అని వాపోయారు. నాగేశ్వరరావు అగ్ర నటుడే అయినప్పటికీ ఆయనతో గల అనుబంధాలను నెమరవేసుకొనేవారిలో పలువురు ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తుండటం గమనార్హం.