బురుజు.కామ్ Buruju.com : Hyderabad: కొన్ని సినిమాలు మనల్ని మనం తడిమి చూసుకొనేలా చేస్తాయి. మనం చేసిన, చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తాయి. అక్షరాలా అటువంటి కోవకు చెందిందే ‘మెయియఝగన్’ Meiyazhagan చిత్రం. ప్రముఖ నటులు కార్తి Karthi, అరవింద స్వామి Aravinda Swami నటించిన ఈ తమిళ సినిమా తెలుగు డబ్బింగుతో Netflix లో స్ట్రీమింగు అవుతోంది. బాబాయి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు సత్యం (అరవింద స్వామి) ఎప్పుడో 22 ఏళ్ల క్రితం విడిచిపెట్టిన పట్టణానికి వెళ్లినప్పుడు అక్కడ చవిచూసిన అనుభవాలే చిత్ర కథ.
చాలా ఏళ్ల తర్వాత స్వస్థలానికి వెళ్లిన సత్యం పట్ల ఒక యువకుడు ( కార్తి ) ఎంతో అనురాగాన్ని కనబరుస్తాడు. తన ఇంటికి తీసుకెళ్లి చాలా ఆదరిస్తాడు. సత్యం కుటుంబం 22 ఏళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయేటప్పుడు పేదవాడైన తన తండ్రికి ఇచ్చిన సైకిలు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందంటూ అప్పటి నుంచి తాను అపురూపంగా చూసుకొంటున్న సైకిలును అతను సత్యానికి చూపించి పొంగిపోతాడు. తన పట్ల ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తున్న అతనెవరో సత్యానికి గుర్తుకు రాదు. అతనెవరో తెలియకుండానే అతని మర్యాదలన్నీ పొందుతాడు. ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న ఆయువకుడిని నీవెవరు? అని అడగలేని పరిస్థితి.
కార్తిని గుర్తిపట్టక పోయినా అతని అభిమానాన్ని ఆస్వాదిస్తున్న అరవింద స్వామి
తనకు పుట్టబోయేది అడ, మగ ఎవరైనప్పటికీ సత్యం పేరును పెడతానని అతను చెబుతాడు. తనను పేరుతో పిలవనే లేదని, తన ఇంటి నుంచి తిరిగి వెళ్లేటప్పుడైనా తనకు పుట్టబోయే బిడ్డను, తనను పేర్లతో పిలిచి ఆశీర్వదించాలంటూ నిద్రలో అతను కలవరించటం సత్యం మనస్సును పిండేస్తుంది. ఎందుకంటే.. అతనెవరో సత్యానికి గుర్తులేదు. ఎవరో తెలియకుండానే అతను, అతని భార్య చూపించిన ఆదరాభిమానాలను పొందానని తీవ్ర క్షోభకు గురయ్యి కన్నీరు కారుస్తూ ఇక అక్కడ ఉండబుద్ది కాక రాత్రికిరాత్రే అక్కడి నుంచి అతనికి చెప్పకుండా తన ఊరికి వెళ్లిపోతాడు. అతని ఫోను నెంబరు సత్యం వద్ద ఉన్నప్పటికీ అతనెవరో తెలియదు కనుక ఫోను చేసి మాట్లాడటానికి సాహించలేని పరిస్థితిలో ఉంటాడు. ఇదంతా గమనించిన సత్యం కుమార్తె తన తండ్రి వద్ద గల నెంబరుకు ఫోను చేసి ఫోనును తండ్రికి ఇస్తుంది. ‘నీవెవరో నాకు గుర్తు లేదు. నన్ను క్షమించు’ అంటూ సత్యం కన్నీరు పెడతాడు.
అప్పుడు సత్యం 10వ తరగతిలో ఉన్నప్పుడు అతను కొంతమంది ఇరుగుపొరుగు పిల్లల్ని దగ్గరకు తీసుకొని వారిని ఆప్యాంగా చూడటం, వారిని కొన్ని కూరగాయల పేర్లతో పిలవటాన్ని ఆయువకుడు గుర్తు చేస్తాడు. దీంతో సత్యానికి ఒక్కోటి గుర్తుకు వచ్చి తనను ఎంతగానో ఆదరించిన యువకుడికి అతని బాల్యంలో తాను పెట్టిన పేరు ‘పొటాటో’ అని తెలుసుకొంటాడు. పొటాటో అసలు పేరును ఎట్టకేలకు కనుగొని రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తన స్వస్థలానికి వెళ్లి అక్కడ ఆ యువకుడిని ‘సుందరం’ అని పిలుస్తాడు. సినిమాలోని పలు సన్నివేశాలు మనస్సును హత్తుకొంటాయి. చిన్ననాటి స్నేహితులు ఎదురైనప్పుడు చాలా మంది ఇటువంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. వారిని ఏ పేరుతో సంబోధించాలో తెలీక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి అంశాన్ని చిత్రంగా మలచిన దర్శకుడు C. Prem Kumar, నిర్మాతలు Surya, Jyothika అభినందనీయులు. తెలుగులో ధియేటర్లలో ఇది ‘సత్యం సుందరం’ పేరుతో విడుదలయ్యింది. ఓటీటీలో మాత్రం తమిళ పేరైన Meiyazhagan పేరుతో స్ట్రీమింగు అవుతోంది.